బీసీలు కేంద్రంగా రాష్ట్రంలో పాలన : మహేశ్ గౌడ్

బీసీలు కేంద్రంగా  రాష్ట్రంలో పాలన : మహేశ్ గౌడ్
  • పార్టీలో, నామినేటెడ్‌‌‌‌ పదవుల్లో బీసీలకే ప్రాధాన్యత: మహేశ్ గౌడ్
  • గాంధీ భవన్‌‌‌‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ మీటింగ్‌‌‌‌కు హాజరు

హైదరాబాద్, వెలుగు:  బీసీలు కేంద్రంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. గురువారం గాంధీ భవన్‌‌‌‌లో పీసీసీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గం సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరై, మాట్లాడారు. బీసీల కోసం చిత్తశుద్ధితో రెండు చట్టాలను తీసుకొచ్చామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుల గణన సర్వే చేసి, రాష్ట్రంలో బీసీలు 56 శాతం ఉన్నారని అధికారిక డాక్యుమెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. మూడు బిల్లులు గవర్నర్ వద్దే పెండింగ్‌‌‌‌లో ఉన్నాయన్నారు. ఇటు నామినేటెడ్ పదవుల్లో అటు పార్టీ పదవుల్లో బీసీలకే ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. పీసీసీ కార్యవర్గంలో 50 శాతం బీసీలకే కేటాయించామని వెల్లడించారు. 17 జిల్లాలకు బీసీలనే డీసీసీ చీఫ్‌‌‌‌లుగా నియమించామన్నారు. 2029లో జరగనున్న లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమన్నారు.

అప్పుడు రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత తెచ్చుకుంటామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలు అత్యధిక సీట్లను గెలుచుకోవాలని సూచించారు. అలాగే, రాష్ట్ర కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం సభ్యత్వ నమోదు యాప్‌‌‌‌ను మహేశ్ గౌడ్ ప్రారంభించారు. దివ్యాంగులకు కాంగ్రెస్ సభ్యత నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ యాప్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.