హైదరాబాద్, వెలుగు: తమిళనాడు ప్రజలు టీవీకేకు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర గవర్నర్ అగౌరవ పరుస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. 108 స్థానాల్లో గెలిచి అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా టీవీకే నిలవగా ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆ పార్టీని ఆహ్వానించకపోవడాన్ని మహేశ్ గౌడ్ గురువారం ఓ ప్రకటనలో తప్పుపట్టారు. గవర్నర్ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని సమాధి చేసినట్లు ఉందని ఆరోపించారు.
తమిళనాడులో గవర్నర్ ద్వారా పాలన చేయాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. అనంతరం రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారికి గురువారం గాంధీ భవన్ లో మహేశ్ గౌడ్ నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా పలువురు చైర్మన్లు కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
