V6 News

కాళేశ్వరం అవినీతిపై పోరాటంలో రాజీపడం : పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌

కాళేశ్వరం అవినీతిపై పోరాటంలో రాజీపడం : పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌
  •     బీఆర్ఎస్ సంబురాలు ముణ్నాళ్ల ముచ్చటే: పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌
  •     ఆలస్యం అయినా.. దోషులంతా జైలుకెళ్లడం ఖాయం
  •     సీబీఐ విచారణ చేయాలని ఢిల్లీలో ధర్నా చేస్తం

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం అవినీతిపై పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేదే లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ అవినీతిలో కేసీఆర్, హరీశ్‌‌‌‌రావు ప్రమేయం లేదని హైకోర్టు చెప్పలేదని, క్లీన్ చిట్ ఇవ్వలేదని, బీఆర్ఎస్ ఎందుకు సంబురాలు చేస్తున్నదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ సంబురాలు ముణ్నాళ్ల ముచ్చటే అని, కాస్త ఆలస్యమైనా దోషులందరూ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరంతోపాటు ఫార్ములా ఈ కారు రేసింగ్‌‌‌‌, ఫోన్ ట్యాపింగ్ సహా అన్నింటిపై విచారణలు జరుగుతున్నాయని, దోషులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దీనిపై కేంద్రం దిగిరాకుంటే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.  బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మహేశ్‌‌‌‌గౌడ్​ మీడియాతో మాట్లాడారు. ప్రజాధనం లక్షకోట్లు నీళ్లపాలు చేశారని, వారిని వదిలిపెట్టేదే లేదని అన్నారు. పీసీ ఘోష్ రిపోర్ట్‌‌‌‌ను, విజిలెన్స్ కమిషన్ విచారణను హైకోర్టు తప్పుపట్టలేదని చెప్పారు. ఇందులో కొన్ని విధానపరమైన లోపాలున్నాయని మాత్రమే హైకోర్టు చెప్పిందని వివరించారు.  

సీబీఐ దర్యాప్తులో జాప్యమెందుకు?

పీసీ ఘోష్ కమిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టులో స్పష్టంగా కాళేశ్వరం నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయని చెప్పారని మహేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అన్నీ తానై ఏకఛత్రాధిపత్యం చేశారని, కాంట్రాక్టర్ల జేబులు నింపారని ఆరోపించారు. సీబీఐకి విచారణాధికారం కేంద్రమే అప్పగిస్తే, సీబీఐ దర్యాప్తు చేయడంలో జాప్యం ఎందుకో చెప్పాలని అడిగారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డానే స్వయంగా ఆరోపించారని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు.  ఈ ఆరోపణలు నిజమా? కాదా? కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే నెలరోజుల్లో అరెస్టు చేస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. మరో మంత్రి బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. 

ఓబీసీ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్‌‌‌‌కు హాజరు.. 

కాంగ్రెస్‌‌‌‌ అగ్రనేత, లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో జరిగిన ‘ఓబీసీ కాంగ్రెస్ అడ్వైజరీ కౌన్సిల్’ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఇతర నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్‌‌‌‌లో జరిగిన ఈ సమావేశంలో.. ఓబీసీ గణన, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపులాంటి ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన హక్కులు కల్పించాలని, ఇందుకోసం జాతీయస్థాయిలో కుల గణన జరగాలని రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేశారు. ఓబీసీ విభాగం బలోపేతం, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కుల గణన చేసిన విధానాన్ని మహేశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌ వివరించారు.