ఓటు చోరీ ఆరోపణలకు ఆధారాలు చూపే దమ్ముందా? : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఓటు చోరీ ఆరోపణలకు ఆధారాలు చూపే దమ్ముందా? : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై విషం చిమ్మడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషిలపై ఓటు చోరీ, రాజకీయ జోక్యం అంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. దమ్ముంటే ఆ ఆరోపణలకు సరైన ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. 

ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన ప్రతిసారీ ప్రజాతీర్పును అవమానిస్తూ, ఈసీని బలిపశువును చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీహార్, బెంగాల్ ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను సుప్రీంకోర్టు స్వయంగా పరిశీలించిందని గుర్తుచేశారు. న్యాయస్థానం పర్యవేక్షించిన అంశాన్ని కూడా వక్రీకరించి నీచ రాజకీయ ప్రచారానికి వాడుకోవడం సిగ్గుచేటన్నారు. 

ఓటర్ల జాబితా నుంచి తొలగింపులకు చట్టపరమైన కారణాలు, పునర్ నమోదు అవకాశాలు ఉంటాయని ఈసీ స్పష్టంగా చెబుతుంటే.. వాస్తవాలను వక్రీకరిస్తూ 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.