V6 News

హైవేపై మక్క రైతుల ఆందోళన.. ఇల్లంద మార్కెట్ కొనుగోలు కేంద్రంలో కొర్రీలు పెడుతున్నారని ఆవేదన

హైవేపై మక్క రైతుల ఆందోళన.. ఇల్లంద మార్కెట్  కొనుగోలు కేంద్రంలో కొర్రీలు పెడుతున్నారని ఆవేదన
  •     ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే 20 క్వింటాళ్లు మాత్రమే ఎలా కొంటారని ఫైర్

వర్దన్నపేట,వెలుగు: వరంగల్  జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్  మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ రైతులు హైవేపై ఆందోళనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే, 20 క్వింటాళ్లే కొనుగోలు చేయడమేమిటని ప్రశ్నించారు. కొనుగోళ్లు చేయకుండా కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

డబ్బులు ఇస్తేనే కాంటాలు పెడుతున్నారని, ఇవ్వని వారికి కాంటాలు పెట్టకుండా అధికారులు, హమాలీలు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాంటాలు అయినా వాటిని తరలించడం లేదన్నారు. రైతులకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపి మక్కలు ఎప్పటికప్పుడు కాంటా పెట్టాలని, ట్రాన్స్​పోర్ట్  చేయాలని డిమాండ్​ చేశారు. మార్కెట్​ యార్డులో సౌలతులు కల్పించడంలో  అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అధికారులతో మాట్లాడి కాంటాలు వేసేలా చూస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.