మైనర్టీ ఓటు బ్యాంక్ పై నజర్ .. ఓటర్లకు పలు హామీలిస్తున్న నేతలు

మైనర్టీ ఓటు బ్యాంక్ పై నజర్ .. ఓటర్లకు పలు హామీలిస్తున్న నేతలు
  • మైనర్టీ ఓటు బ్యాంక్ పై నజర్ ..
  • ఓటర్లకు పలు హామీలిస్తున్న నేతలు
  • సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ భారీగా ప్రచారం​
  • ఆరు గ్యారంటీ స్కీమ్​లపై అవగాహన కల్పిస్తున్న కాంగ్రెస్
  • ఇంటింటికి వెళ్లి ఓటర్​ స్లిప్పుల పంపిణీ

హైదరాబాద్​,వెలుగు : గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో మైనార్టీ ఓట్లపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్​ పోటీ పడుతూ.. మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. తమకు ఓటు వేసేలా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముషీరాబాద్​, సనత్​నగర్​, సికింద్రాబాద్​, ఖైరతాబాద్​, జూబ్లీహిల్స్​ వంటి స్థానాల్లో మైనార్టీ ఓటర్లుగా బాగానే ఉన్నారు. దీంతో  గులాబీ పార్టీ నేతలు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ముఖ్యంగా బీఆర్​ఎస్​ సంక్షేమ పథకాలైన డబుల్​ బెడ్​రూం, షాదీముబారక్​, పింఛన్లతో  ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే మరిన్ని కొత్త పథకాలు తీసుకొస్తామంటూ ఆకర్షిస్తున్నది. కాంగ్రెస్​అభ్యర్థులను ప్రకటించకపోయినా.. ఆశావహ నేతలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ముషీరాబాద్​లో మాజీ ఎంపీ, ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తానంటున్న ఎం. అంజన్​కుమార్​యాదవ్ ​నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టిపెట్టారు.

కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్ లపై ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికి కార్యకర్తలు వెళ్లి ఓటర్​స్లిప్పులు అందజేస్తున్నారు. అన్ని కుటుంబాల్లో అర్హులైన వారికి ఓటు ఉందా? లేదా? అనేది అడిగి తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే ముస్లింలకు మరిన్ని పథకాలు అమలు చేస్తామంటూ హామీలిస్తున్నారు.  సనత్​నగర్​ నియోజకవర్గంలో మర్రి ఆదిత్యారెడ్డి, మరికొందరు ఎవరికి వారే తమకే టికెట్​వస్తుందన్న ధీమాతో మైనార్టీలను ప్రసన్నం చేసుకుంటున్నారు. 

మరిన్ని పథకాలు ఇప్పిస్తమంటూ..

బీఆర్ఎస్​ సిట్టింగ్​అభ్యర్థులు ఒకడుగు ముందుకేసి ప్రత్యేకంగా మైనార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే అర్హులకు డబుల్​బెడ్​రూం, షాదీ ముబారక్​, ఆసరా పింఛన్ల వంటివి ఎక్కువ మంజూరు చేయిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. సనత్​నగర్, సికింద్రాబాద్​, ముషీరాబాద్​, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్​ ప్రాంతాల్లో బీఆర్ఎస్​ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఆయా స్థానాల్లో కాంగ్రెస్​ టికెట్ఆశిస్తున్న వారు కూడా మైనార్టీలకు గాలం వేస్తున్నారు. ఆకట్టుకునేందుకు వారి ఇళ్లకు వెళ్లి పలకరించడం, ప్రార్థనా మందిరాల వద్దకు వెళ్లి కలుస్తున్నారు. ఓటరు లిస్ట్​లో పేరు లేకపోయినా, ఇతర ఏ సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు. తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటరు స్లిప్పులను కూడా పంపిణీ చేస్తున్నారు. 

కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తే..

కాంగ్రెస్​, బీఆర్ఎస్​ పోటా పోటీ ప్రచారంతో చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తే మాత్రం ఎన్నికల ప్రచారం మరింత జోరందుకోనుంది.  ఇదిలా ఉండగా కాంగ్రెస్​, బీజేపీ తరఫున తమకు ఎలాంటి అభ్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురవుతుందోనని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎదురుచూస్తున్నారు.