రైల్వే ట్రాక్ కింద భారీగా వాటర్ లీకేజీ

 రైల్వే ట్రాక్ కింద భారీగా వాటర్ లీకేజీ
  • దయానంద్ నగర్​లో ఘటన  
  • ట్రాక్​కు ప్రమాదం వాటిల్లకుండా పైప్​లైన్ పనులు షురూ  

హైదరాబాద్​సిటీ, వెలుగు: మల్కాజిగిరి సర్కిల్, మిర్జాలగూడ వార్డులోని దయానంద్ నగర్ రైల్వే ట్రాక్ కింద భారీ వాటర్​పైపులైన్​లీకయ్యింది. దయానంద్ నగర్ రైల్వే ట్రాక్ మధ్యలో నీరు ఉబికి పైకి రావడం గమనించిన రైల్వే అధికారులు.. వాటర్​బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లీకేజీ కొనసాగితే ట్రాక్ కు ప్రమాదం కలగవచ్చని, యుద్ధప్రాతిపదికన రిపేర్లు మొదలుపెట్టారు. ట్రాక్​ను ఆనుకుని ఉన్న రిసెప్షన్ పిట్ వద్ద తవ్వకాలు చేపట్టగా, 20 అడుగుల లోతులో 300 మిమీ ఎంఎస్ క్యారియర్ పైప్, 800 మిమీ కేసింగ్ పైప్ కనిపించింది.

దీంతో పనుల కోసం జేసీబీ, ఎయిర్ కంప్రెషర్లు, డీ-వాటరింగ్ పంపులు తెచ్చి చేస్తున్నారు. ప్రస్తుతమున్న300 మి.మీ ఎంఎస్ పైప్​లైన్​ను పూర్తిగా తొలగించి కొత్తది ఏర్పాటు చేయడమే శాశ్వత పరిష్కారమని నిర్ణయించారు. దీనికి రూ.48 లక్షలు అవుతుందని అంచనా వేశారు. రిపేర్లు పూర్తయ్యేవరకు వాణినగర్, భవానినగర్ ప్రాంతాలకు సరఫరా నిలిపివేశారు. అప్పటివరకు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు ఉచితంగా ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు.