
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ వెనుక నుండి ఢీకొట్టింది. బస్సులో ఉన్న వారిలో నలుగురు మృతి చెందగా 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెళ్ళి గ్రామానికి చెందిన వారు కాగా.. పరిగిలో ఓ విందులో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది.
బస్సులో ఇరుక్కుపోయిన నలుగురు మృతులను పోలీసులు అతి కష్టంగా బయటకు తీశారు. రోడ్డు ప్రమాదం జరగడంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మృతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.