నల్గొండ/యాదాద్రి, వెలుగు: జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ‘స్వీయ గణన’ విధానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ, యాదాద్రి కలెక్టర్లు బి. చంద్రశేఖర్, అనురాగ్ జయంతి చెప్పారు. శనివారం ఆయా కలెక్టరేట్‌లో వారు మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు తమ వివరాలను అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చన్నారు.
కుటుంబంలో ఒకరు 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి పొందిన ఐడీని తర్వాత వచ్చే ఎన్యూమరేటర్‌కు చూపాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ జనగణనలో కుల గణనను కూడా చేపడుతున్నామని తెలిపారు. నల్గొండ జిల్లాలోని 5.3 లక్షల గృహాల కోసం 3,179 మంది గణకులు, 503 మంది సూపర్వైజర్లను నియమించినట్లు వెల్లడించారు.

