ఫర్జీ వెబ్ సిరీస్ చూసి దొంగనోట్ల తయారీ

ఫర్జీ వెబ్ సిరీస్ చూసి దొంగనోట్ల తయారీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. సైబరాబాద్  బాలానగర్  పరిసర ప్రాంతాల్లో నకిలీ నోట్ల దందా చేస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్‌‌‌‌ఓటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4 లక్షలు విలువ చేసే రూ.500 కరెన్సీతో కూడిన 810 నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్లు, పేపర్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఎస్‌‌‌‌ఓటీ డీసీపీ శ్రీనివాస్‌‌‌‌  తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్​ కు చెందిన వనం లక్ష్మీనారాయణ(37) బోడుప్పల్ మారుతినగర్‌‌‌‌‌‌‌‌లో నివాసం ఉంటున్నాడు. నకిలీ బంగారం తాకట్టుపెట్టి గతంలో బోయినపల్లి పోలీసులకు చిక్కాడు. 

జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఈజీ మనీ కోసం మోసాలకు ప్లాన్ చేశాడు. నకిలీ నోట్లను తయారు చేసేందుకు బాలీవుడ్‌‌‌‌  వెబ్ సిరీస్  ‘ఫర్జీ’ పలుమార్లు చూశాడు. సినిమాలో చూపినట్లు నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసి మార్కెట్‌‌‌‌లో అమ్మడం ప్రారంభించాడు. బీటెక్‌‌‌‌  చదవడంతో కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌, ప్రింటర్స్‌‌‌‌పై నిందితుడికి మంచి అవగాహన ఉంది. నకిలీ నోట్లు తయారు చేసేందుకు అవసరమైన సామగ్రి కొన్నాడు. ఒరిజినల్‌‌‌‌  నోట్స్‌‌‌‌తో పోలిస్తే గుర్తించలేని విధంగా రూ.500 నోట్లను ప్రింట్‌‌‌‌  చేసేవాడు. వాటిని 1:4 రేషియో ప్రకారం రూ.50 వేలు ఒరిజినల్‌‌‌‌  నోట్లు ఇస్తే రూ.2 లక్షలు విలువ చేసే ఫేక్  నోట్లు ఇచ్చేవిధంగా ఏజెంట్లు, కస్టమర్లతో డీల్  మాట్లాడుకునేవాడు. ముందుగా కొన్ని ఫేక్  నోట్స్‌‌‌‌ ఇచ్చి చెలామణి చేయాలని సూచించేవాడు.

నకిలీ నోట్లు చెలామణి చేస్తూ దొరికిపోయారు

వరంగల్‌‌‌‌  జిల్లా సంగెం మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ఎరుకల ప్రణయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ‌‌‌‌(26) ను లక్ష్మీనారాయణ కలిశాడు. తాను ప్రింట్‌‌‌‌  చేసిన నకిలీ నోట్లు రూ.20 వేలు ఇచ్చాడు. వాటిని చెక్‌‌‌‌  చేసేందుకు శుక్రవారం రాత్రి ప్రణయ్‌‌‌‌ కుమార్ బాలానగర్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని అల్లాపూర్‌‌‌‌‌‌‌‌  కూరగాయల  మార్కెట్‌‌‌‌కి వెళ్లాడు. కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారుల వద్ద వారికి అనుమానం రాకుండా చెలామణి చేసేందుకు యత్నించాడు. అప్పటికే లక్ష్మీనారాయణ దొంగనోట్ల దందాపై నిఘా పెట్టిన బాలానగర్  స్పెషల్  ఆపరేషన్  టీమ్‌‌‌‌.. ప్రణయ్‌‌‌‌ను అదుపులోకి తీసుకుంది. పోలీసులు ఫేక్ నోట్లు సీజ్  చేశారు. తరువాత లక్ష్మీనారాయణను కూడా అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు.