దక్షిణాదిలో మాదిగలను రాజకీయ శక్తిగా మారుస్తం : గాలి వినోద్ కుమార్

దక్షిణాదిలో మాదిగలను రాజకీయ శక్తిగా మారుస్తం : గాలి వినోద్ కుమార్

సికింద్రాబాద్, వెలుగు: మాదిగల రిజర్వేషన్ వర్గీకరణ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, అందుకు కమిటీ వేస్తున్నామని ప్రధాని మోడీ చెప్పినప్పటికీ  తెలంగాణలో బీజేపీ ఒక్క రిజర్వ్ డ్​సీటు కూడా గెలవలేదని సదరన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ రిజర్వ్ డ్ సీట్లు గెలవకపోవడానికి కారణం..  30 ఏండ్లుగా మాదిగలను మందకృష్ణ మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. మాదిగ కులాల్లో 90 శాతం క్రైస్తవులేనన్నారు. మతం మారిన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వమని సుప్రీంకోర్టుకు తెలిపిన బీజేపీని నమ్మి వారంతా ఎలా ఓట్లేస్తారని ఆయన ప్రశ్నించారు.  సోమవారం తార్నాకలోని ఆయన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.   రాజ్యాంగ పరంగా, రాజకీయాల పరంగా సాధ్యంగాని భారత రాజ్యాంగ అధికరణ 341ను సవరించాలంటే 2/3 మెజార్టిటీ రాజ్యసభలో ఉండాలన్నారు.

50 శాతం రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానం జరగాలని ఇది ప్రస్తుత సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ  ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదన్నారు.  పార్లమెంటులో 108 ఎస్సీ ఎంపీల్లో వందమంది వర్గీకరణకు వ్యతిరేకమన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా షెడ్యూల్ కులాల మెజారిటీ ఎంపీలు వ్యతిరేకిస్తే వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ఎలా ఆమోదిస్తారని ఆయన  ప్రశ్నించారు. భారత రాజ్యాంగం అధికరణ 371-డి ప్రకారం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జోనల్ సిస్టం ద్వారా విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల పంపిణీ జరుగుతున్నదన్నారు. అందులోనే వర్గీకరణ అంశాన్ని చేర్చితే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడం  ద్వారా శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు.   సమావేశంలో టీఎస్ ఎమ్మార్పీఎస్  రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు,  మాదిగ మేధావుల ఫోరం జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ నతానియల్,  నరసింహ  పాల్గొన్నారు.