వికారాబాద్, వెలుగు: మాలల రణభేరి మహాసభను జయప్రదం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చిన్నయ్య పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్లో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాసభ కర పత్రాన్ని ఆవిష్కరించారు. నవంబర్23న హైదరాబాద్ సరూర్నగర్స్టేడియంలో తలపెట్టిన మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయడానికి మాలలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్ల నిధుల కేటాయించాలని డిమాండ్ చేశారు. మాలల సామాజిక భవనం ఏర్పాటు తదితర డిమాండ్ల సాధనకై మహాసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అనంతరం జరిగిన రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తామన్నారు. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచాలన్నారు. సీనియర్ నాయకులు కడిచెర్ల రత్నం, రవీందర్, యాదయ్య, అశోక్, నర్సింహులు, ప్రశాంత్, రాములు, నరేందర్, అడ్వకేట్లు మల్లయ్య, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు మాలల రణభేరి మహాసభ కర పత్రాన్ని వారు ఆవిష్కరించారు.
