
సక్సెస్ అవ్వడం ఒక్కోసారి ఆలస్యం కావచ్చు, కానీ సిన్సియర్‌గా ప్రయత్నిస్తే గెలుపు సాధించడం ఖాయం అంటోంది మాళవికా మోహనన్. ఆ మాటలు నిజమనడానికి ఆమె కెరీరే ఉదాహరణ. పదేళ్ల క్రితం మలయాళ సీమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో నటించింది. కానీ అంతగా కలిసి రాలేదు. ఎప్పుడైతే కోలీవుడ్‌లో ఎంటరయ్యిందో, ‘పేట్ట’లో రజినీకాంత్ స్నేహితుడికి భార్యగా కనిపించిందో అప్పట్నుంచీ ఆమె కెరీర్ టర్న్ తీసుకుంది. మాస్టర్, మారన్ చిత్రాల్లో ఫిమేల్ లీడ్‌గా చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సరసనే చోటు సంపాదించింది. అతనితో మారుతి తీయబోతున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లో మాళవికని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. ఇదింకా మొదలు కాకముందే వెర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్‌తో కలిసి నటించేందుకు రెడీ అయ్యింది మాళవిక.
విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి మొదట రష్మికను తీసుకోవాలని అనుకున్నారు. కానీ డేట్స్ ఖాళీ లేక ఆమె నో అందట. దాంతో ఆ స్థానంలోకి మాళవిక వచ్చింది. అతి త్వరలో షూటింగ్ మొదలు కానుంది కాబట్టి ఆమె పేరును అఫీషియల్‌గా అనౌన్స్ చేసే టైమ్ దగ్గర పడినట్టే. ఇక ఇది కాక హిందీలో ‘యుధ్ర’ అనే యాక్షన్ థ్రిల్లర్‌లోనూ నటిస్తోంది.