కౌలాలంపూర్: పిల్లలపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతున్నదని.. వారి రక్షణ, భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. 16 ఏండ్ల లోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్, థ్రెడ్, టిక్‌టాక్.. వంటి సోషల్ మీడియాలో ఆ ఏజ్లోపు వారికి అకౌంట్లు ఉంటే తొలగించనున్నట్లు వెల్లడించింది.
ఇది వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానుంది. 16 ఏండ్లలోపు వారికి సోషల్‌మీడియా బ్యాన్‌ను అమలుచేస్తూ కేబినెట్నిర్ణయం తీసుకుందని మలేసియా కమ్యూనికేషన్ మంత్రి ఫాహ్మీ ఫాజిల్ మీడియాకు వెల్లడించారు. యువత భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా కారణంగా 16 ఏండ్ల లోపు పిల్లలు సైబర్ నేరస్థుల ఉచ్చులో చిక్కుకుంటున్నారని, లైంగిక దాడులకు గురవుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల వారి భవిష్యత్తు ఆగమవుతున్నదని.. అందుకే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘గవర్నమెంట్, రెగ్యులేటరీ బాడీస్, తల్లిదండ్రులు అందరూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.. కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి” అని ఫాజిల్ తెలిపారు. 16 ఏండ్లలోపు వారి సోషల్ మీడియా ఖాతాలను గుర్తించేందుకు, కొత్తగా వారి ఎంట్రీని నిషేధించేందుకు ఇతర దేశాల్లో అమలవుతున్న విధానాలు పరిశీలిస్తామని చెప్పారు.
