రిటైర్డ్ ఉద్యోగుల పొట్ట కొడు తున్నరు : మల్క కొమరయ్య

రిటైర్డ్ ఉద్యోగుల పొట్ట కొడు తున్నరు : మల్క కొమరయ్య
  •     నేడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా
  •     బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి 

హైదరాబాద్, వెలుగు: పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల పొట్ట కొడుతున్నదని బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, మారెడ్డి అంజిరెడ్డి ఆరోపించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఉద్యోగుల హక్కు అని, ఆ హక్కులను సైతం ఈ సర్కార్ కాలరాస్తున్నదని విమర్శించారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. 

ఉద్యోగుల విషయంలో కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా, ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తమ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పెండింగ్ లో ఉన్న అన్ని బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసిందని, మార్పు వస్తుందన్న ఆశతో జనం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓట్లు వేశారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తున్నదని ఆరోపించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రతినెలా రూ.700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటి వరకు నయాపైసా విదిల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ‘మహాధర్నా’ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.