జెండా ఊపే పనిలో పడి  రైళ్ల భద్రత మరిచారా? .. ప్రధాని మోడీపై మల్లికార్జున్ ఖర్గే ఫైర్

జెండా ఊపే పనిలో పడి  రైళ్ల భద్రత మరిచారా? ..  ప్రధాని మోడీపై మల్లికార్జున్ ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రైళ్లకు జెండా ఊపే పనిలో పడి రైల్వే భద్రతను మరిచిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న అధికారులందరూ బాధ్యులేనని తెలిపారు.

ఆదివారం ఆయన వరుస ట్వీట్ల ద్వారా మోడీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. తొమ్మిదేళ్లుగా రైల్వేలో ఖాళీగా ఉన్న మూడు లక్షల పోస్టులను ఎందుకు భర్తీ చేయట్లేదని కేంద్రాన్ని నిలదీశారు. ఉద్యోగుల కొరత వల్లే ఉన్న లోకో పైలట్లపై పని భారం పెరిగిందని తెలిపారు.

ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం కూడా రైలు ప్రమాదాలు పెరగడానికి ప్రధాన కారణమని రైల్వే బోర్డు వెల్లడించినట్లు చెప్పారు. సిగ్నలింగ్ సిస్టమ్‌‌ను ఎప్పటికప్పుడు రిపేర్ చేసేలా చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ప్రమాదాలపై దర్యాప్తు చేసే రైల్వే సేఫ్టీ కమిషనర్(సీఆర్‌‌ఎస్‌‌) ను ఎందుకు బలోపేతం చేయలేదని అడిగారు.