ప్రజా తెలంగాణ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

ప్రజా తెలంగాణ లక్ష్యాన్ని  ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ :  ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
  •     ఏఐసీసీ చీఫ్ ​మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, వెలుగు: ప్రజా తెలంగాణ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కార్యాచరణను  రూపొందించామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణ ప్రజలకు సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం అందించాలన్న దృఢ సంకల్పం ఉందని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చుతూ, సమగ్ర, సమానత్వంతో కూడిన తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి పునరుద్ఘాటించారు. 

ఈ మేరకు గురువారం రాష్ట్ర ముఖ్యనేతలతో భేటీ అనంతరం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులను ఖర్గే అభినందించారు. ‘‘తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించాం. ఈ మీటింగ్‌లో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించాం. ‘ప్రజా తెలంగాణ’ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కార్యాచరణ రూపొందించాం”అని ట్వీట్ చేశారు.