ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు : ఖర్గే

ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు : ఖర్గే

బెంగళూరు : అధికారంపైనా లేదా ప్రధానమంత్రి పదవిపైనా కాంగ్రెస్‌ కు ఆసక్తి లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చెప్పారు. అధికారంలోకి రావడం తమ ఉద్దేశం కాదని.. కేవలం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే లక్ష్యంగా బెంగళూరులో రెండోరోజు జరుగుతున్న విపక్షాల సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. 

తాము అధికారంలోకి రావడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. రాష్ట్ర స్థాయిలో తమలో కొన్ని విభేదాలున్న మాట వాస్తవమే.. కానీ, అవి సిద్ధాంతరపరమైనవి కావని గుర్తించాలన్నారు. ఇవేవీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల ముందు పెద్ద విషయాలు కావన్నారు మల్లికార్జున ఖర్గే. 

తాము 26 పార్టీలకు చెందిన వారమన్న ఖర్గే.. 11 రాష్ట్రాల్లో తమ పార్టీలు అధికారంలో ఉన్నాయని చెప్పారు. బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించలేదన్నారు. ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి పని చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని బీజేపీ వదిలేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడితోపాటు ఆయా రాష్ట్రాల కాషాయ నేతలు పాత మిత్రుల కోసం వివిధ రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేస్తున్నారని ఖర్గే విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు లక్ష్యంగా వరుసగా రెండో రోజు విపక్షాలు సమావేశమయ్యాయి. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ఎండ్‌ హోటల్‌లో మంగళవారం (జులై 18న) ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు.