మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల క్రాస్ రోడ్డు వద్ద సోమవారం మండల రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతుల ఆందోళనకు దిగారు. వరద కాలువల్లోకి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి, వరి నాట్లతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరద కాలువల్లోకి నీటిని విడుదల చేయకపోవడంతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. సకాలంలో సాగునీరు అందకపోతే వరితో పాటు ఇతర పంటలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని, రైతులు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కరువుకు కారణం రేవంతే: జీవన్ రెడ్డి
మల్యాలలో జరిగిన రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వస్తున్న బీఆర్ఎస్ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని నూకపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌ను కొండగట్టు వద్ద నిలిపివేశారు. పోలీసులను తప్పించుకున్న జీవన్ రెడ్డి వీఆర్కే కళాశాల సమీపంలో కొద్దిసేపు ధర్నా చేశారు. అక్కడి నుంచి నూకపల్లి వరద కాలువ వద్దకు చేరుకుని కాలువను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. కండ్లపల్లి పంపు హౌస్ వద్ద, అవసరం అయితే కాపర్ డ్యామ్ నిర్మించి ప్రాణహిత జలాలను విడుదల చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల క్రితమే ఎల్‌నినో హెచ్చరికలు చేసినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని, ప్రస్తుతం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనికి రేవంత్ రెడ్డే కారణమని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆయన వెంటన పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
