కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ సహా ఆమె మంత్రివర్గంలోని 63% మంది మంత్రులు ఓడిపోయారు. దీదీ కేబినెట్ లో మొత్తం 35 మంది మంత్రులు ఉండగా, వారిలో మమతతోసహా 22 మంది పరాజయాన్ని మూటగట్టుకోవడం సంచలనంగా మారింది. దాదాపు మూడింట రెండొంతుల మంది మంత్రులు తమ స్థానాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు.
అవినీతి ఆరోపణలు, స్థానిక సమస్యలు, దీర్ఘకాలిక పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈ ఓటమికి ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీ బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు గణనీయమైన స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ టీఎంసీ పట్టు కోల్పోయినట్లు కనిపిస్తోంది. పదేండ్లకు పైగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు ఒక హెచ్చరిక లాంటివని, ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ గొడవలు, ఉపాధి కల్పనలో వైఫల్యం, కేబినెట్ సభ్యులపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలు ఓటర్ల తీర్పును ప్రభావితం చేశాయని విశ్లేషకులు అంటున్నారు. గతంలో భారీ మెజారిటీతో గెలిచిన మంత్రులు సైతం ఈసారి స్వల్ప తేడాతో ఓడిపోవడం గమనార్హం.
