ఒక్క సీటు కూడా ఇవ్వబోం .. కాంగ్రెస్​కు తేల్చిచెప్పిన మమత

ఒక్క సీటు కూడా ఇవ్వబోం .. కాంగ్రెస్​కు తేల్చిచెప్పిన మమత
  • సీపీఎంను క్షమించేదిలేదన్న దీదీ

కోల్​కతా: గతంలో తనపై భౌతిక దాడి చేసిన సీపీఎం తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నదని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​కు తమతో పొత్తు కావాలనుకుంటే సీపీఎంతో విడిపోవాల్సిందేనని స్పష్టంచేశారు. సీపీఎంతో కలిసుంటే కాంగ్రెస్​కు ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. రెండు సీట్లు ఇస్తామని ఆఫర్ చేసినా కాంగ్రెస్ నిరాకరించడంతో రాష్ట్రంలో ఒంటరి పోరుకు సిద్దమయ్యామని చెప్పారు. బుధవారం ఆమె మాల్డాలో నిర్వహించిన సభలో మాట్లాడారు.

సీపీఎం గతంలో నాపై భౌతిక దాడి చేసింది. వాళ్ల కార్యకర్తలు నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. నా శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్లే ఇంకా బతికున్నా. సీపీఎంను ఎప్పటికీ క్షమించలేను. అలాంటి పార్టీతో కాంగ్రెస్ చేతులు కలిపింది. ఈ రోజు సీపీఎంతో ఉన్నవాళ్లు భవిష్యత్తులో  బీజేపీతో కూడా ఉండొచ్చు. కాంగ్రెస్​కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకున్నా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వారికి రెండు స్థానాలు ఇవ్వాలని నిర్ణయించాం. కానీ వారు వినిపించుకోలే.." అని మమత పేర్కొన్నారు. 

పెండింగ్ బకాయిలపై 2నుంచి ధర్నా..

వివిధ స్కీముల కింద కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలపై మమత తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.7వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని ఫిబ్రవరి 1లోగా చెల్లించాలని.. లేకుంటే ఫిబ్రవరి 2 నుంచి ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. 

రాహుల్​పై దాడి మా రాష్ట్రంలో జరగలే

కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ​ రాహుల్ గాంధీ వెహికల్ పై దాడి తమ రాష్ట్రంలో జరగలేదని మమతా బెనర్జీ వెల్లడించారు. ఆ దాడి బిహార్​లో జరిగిందని స్పష్టం చేశారు. పగిలిన అద్దాలతోనే ఆయన కారు బెంగాల్లోకి ప్రవేశించిందన్నారు. రాహుల్​పై దాడిని తాను ఖండిస్తున్నట్లు మమత పేర్కొన్నారు.