వరంగల్, వెలుగు: మామునూర్ ఎయిర్‍పోర్ట్ నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది. పనులకు సంబంధించి గురువారం ఎయిర్‍పోర్ట్ అధికారులు గ్రేటర్ వరంగల్లో పర్యటించారు. మామునూర్ ఎయిర్‍పోర్ట్ ప్రాంతానికి చేరుకొని రన్ వే పునర్నిర్మాణం, ఐసోలేషన్ బే ఏర్పాటు, అత్యవసర ప్రవేశ రోడ్డు నిర్మాణం తదితర పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. అనంతరం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఎయిర్‍పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఇందులో 6 నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. టెండర్ నిబంధనలు, సాంకేతిక ప్రమాణాలు, పనుల పరిధి, పనుల వ్యవధి, నిర్మాణ వివరాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కాగా, 15 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు.
