మూత్ర విసర్జన కేసు.. నిందితుడికి బెయిల్

మూత్ర విసర్జన కేసు.. నిందితుడికి బెయిల్

ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ మిశ్రాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పటియాలా హౌజ్ కోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో శంకర్ మిశ్రా జైలు నుంచి విడుదల కానున్నాడు. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి డిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మద్యం తాగిన మత్తులో ఉన్న శంకర్ మిశ్రా.. తన పక్కన కూర్చున్న ఓ వృద్ద మహిళపై మూత్ర విసర్జన చేశాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాలా కాలంపాటు తప్పించుకు తిరిగిన అతడు.. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం అతడిని పటియాలా హౌజ్‌ కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

కాగా, ఘటన జరిగిన వెంటనే బాధితురాలు తన దగ్గర డబ్బులు తీసుకుని రాజీ చేసుకుందని, ఇంకా డబ్బులు కావాలనడంతో తాను నిరాకరించానని, అందుకే నెల రోజుల తర్వాత కేసు పెట్టిందని నిందితుడు ఆరోపించాడు. ఆ తర్వాత నిందితురాలే అనారోగ్యం కారణంగా మూత్రం పోసుకుని తనపై కేసు పెట్టిందని మరో ఆరోపణ చేశాడు. ఇక ఈ ఘటనతో అంతర్జాతీయ వేదికలపై భారత్ పరువు తీశారని వాదిస్తూ ఢిల్లీ పోలీసులు నిందితుడికి బెయిల్‭ను వ్యతిరేకించారు. ఇందుకు స్పందించిన కోర్టు... నిందితుడు చేసిన పని అసహ్యంగా ఉందని అయితే చట్టానికి లోబడి వ్యవహరించాలని అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.