ఫోర్జరీ సంతకాలతో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్న.. ఘరానా మోసగాడు అరెస్ట్, రిమాండ్ 

ఫోర్జరీ సంతకాలతో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్న.. ఘరానా మోసగాడు అరెస్ట్, రిమాండ్ 

హైదరాబాద్​ సిటీ పరిధిలోని  కుత్బుల్లాపూర్​ లో ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లు రిజిస్ట్రేషన్​ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్​చేశారు. భూయజమానుల సంతకాలు ఫోర్జరీ చేసి  ప్లాట్లు అమ్ముతూ అక్రమ దందా చేస్తున్న కన్నెగంటి శ్రీనివాస్​ రావు ను  సూరారం పోలీసులు  అరెస్ట్​ చేసి అనంతరం రిమాండ్​ కు తరలించారు. 

బౌరంపేట్​ లోని సతీష్​ సొసైటీలో 600 గజాల ప్లాట్లకు ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి రిజస్ట్రేషన్​ చేసిన కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్​ చేశారు. జిల్లా రిజిస్ట్రార్​ కార్యాలయం పేరుతో నకిలీ స్టాంపులు, సంతకాలు తయారీ చేయించాడు నిందితుడు. అసలు భూయజమానులు బాలకృష్ణమూర్తి, మహాలక్ష్మీల సంతకాలు ఫోర్జరీ చేసి వసుంధర అనే మహిళ పేరుతో ఫేక్​ రిజిస్ట్రేషన్​ చేయించాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితుడు శ్రీనివాసరావు  మోసాల చిట్టా బయటికి వచ్చింది. 

గతంలో శ్రీనివాసరావుపై దుండిగల్​, నార్సింగి, చేవెళ్ల పోలీస్​ స్టేషన్లలో  సంతకాల ఫోర్జరీ,ఫేక్​ డాక్యుమెంట్ల వ్యవహారంలో పలు కేసులు నమోదు అయ్యాయి. వరసగా నేరాలకు పాల్పడుతుండటంతో BNS సెక్షన్​ 111(ఆర్గనైజ్జడ్​ క్రైమ్​) కింద కేసు నమోదు చేశారు సూరారం పోలీసులు. ఆస్తుల కొనుగోలు,  అమ్మకాల సమయంలో డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాకే లావాదేవీలు జరపాలని పోలీసులు సూచిస్తున్నారు.