కరీంనగర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కరీంనగర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కరీంనగర్  క్రైం, వెలుగు: ‘నాకు వివాహం కాలేదు.. నీ భర్తకు విడాకులు ఇవ్వు. నేను నిన్ను పెండ్లి చేసుకుంటాను.’ అని వివాహితను నమ్మించి మోసం చేసిన వ్యక్తిని కరీంనగర్​ రూరల్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. రూరల్  సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తీగలగుట్టపల్లికి చెందిన ఓ వివాహితకు చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామానికి చెందిన కుక్కల నవీన్ కుమార్‌‌‌‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరా చేసుకున్న నిందితుడు వివాహం చేసుకుంటానని నమ్మించి, భర్తకు విడాకులు ఇవ్వాలని ప్రేరేపించాడు. 

అతడి మాటలు నమ్మిన బాధితురాలు భర్తకు దూరమైంది. తీగలగుట్టపల్లిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని బాధితురాలిని అక్కడ ఉంచి వివాహం చేసుకుంటానని నమ్మిస్తూ ఆరేండ్ల నుంచి ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. వివాహం చేసుకోవాలని నిలదీయగా, అప్పటికే నిందితుడికి వివాహం జరిగినట్లు తేలింది. అయినప్పటికీ తన తల్లిదండ్రులను ఒప్పించి పెండ్లి చేసుకుంటానని నమ్మించి బాధితురాలిని తన స్వగ్రామమైన ఆర్నకొండకు రప్పించాడు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి నవీన్​కుమార్​ బాధితురాలిపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు.