- అల్వాల్ పీఎస్ కు కూతవేటు దూరంలో ఘటన
అల్వాల్, వెలుగు: మందు పార్టీ ఇచ్చాడు.. అనంతరం తన ఇంట్లో గొడవలకు నువ్వే కారణమంటూ స్నేహితుడిని హత్య చేశాడో వ్యక్తి. ఈ సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ ఆనంద్ నగర్ కు చెందిన లక్ష్మణ్, తిలక్ రాజు(23), సోను, రాము, అంజి స్నేహితులు. లక్ష్మణ్ కు ఇతర మహిళలతో వివాహేతర సంబంధం ఉందని అతని భార్యకు తిలక్ రాజు, అతని బావ నితేశ్చెప్పడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై లక్ష్మణ్, అతని భార్య కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని తిలక్రాజు ప్రచారం చేశాడు.
దీంతో తిలక్రాజుపై లక్ష్మణ్కక్ష పెంచుకున్నాడు. అతన్ని అంతమొందించాలని ప్లాన్వేశాడు. శనివారం రాత్రి తిలక్రాజు, సోను, రాము, అంజికి మున్సిపల్ఆఫీస్ఎదుట ఉన్న ఓ పాత భవనంలో మందు పార్టీ ఇచ్చాడు. మద్యం మత్తులో తిలక్ రాజుతో గొడవకు దిగాడు. నీవల్లే తన కుటుంబంలో కలహాలు వచ్చాయంటూ మిగతా స్నేహితులతో కలిసి అతనిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తిలక్ రాజు అల్వాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.
పోలీసులు అతన్ని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.
