- యువకుడిని పట్టుకొని స్తంభానికి కట్టేసిన స్థానికులు
- సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘటన
సూర్యాపేట, వెలుగు : పెండ్లికి నిరాకరించడంతో పాటు తనను దూరం పెడుతోందన్న కోపంతో ఓ యువకుడు సుత్తితో యవతిపై దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేశ్, అలుగునూరుకు చెందిన స్పందన ఎనిమిదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలియడంతో వారు పెండ్లికి ఒప్పుకోలేదు. ఇరు కుటుంబాల మధ్య ఇటీవల పంచాయతీ జరుగగా.. ఒకరినొకరు కలుసుకోకూడదని పెద్ద మనుషులు సూచించారు.
అయినప్పటికీ ఇద్దరం పెండ్లి చేసుకుందామని యువతిపై ఒత్తిడి చేస్తుండడంతో ఆమె మహేశ్‌ను దూరం పెడుతోంది. ఈ క్రమంలో స్పందన ఇటీవల సూర్యాపేట స్నేహనగర్‌లోని తన సోదరి ఇంటికి వచ్చింది. స్పందన ఒంటరిగా ఉందని తెలుసుకున్న మహేశ్.. అక్కిడికి వచ్చి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆగ్రహానికి గురైన మహేశ్ తన వెంట తెచ్చుకున్న సుత్తితో స్పందన తలపై, ఒంటిపై దాడి చేశాడు. యువతి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన మహేశ్‌ను పట్టుకొని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన స్పందనను హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్సై మహేశ్ పరిశీలించారు. చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు.
