బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్: గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ వద్ద ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‎లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్న (35) పెయింటర్‎గా పనిచేస్తూ గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ.. ఆదివారం (జూన్ 1) సాయంత్రం బొటానికల్ గార్డెన్ ఫ్లై ఓవర్ పైనుంచి దూకాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన చిన్నాను స్థానికులు వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పటల్‎కు తరలించారు. 

ఆసుపత్రికి తీసుకొచ్చే లోపే చిన్న మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు ఆరా తీశారు. చిన్న ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.