కూకట్ పల్లిలో సహస్ర హత్య కేసు.. వీడని మిస్టరీ..బాలిక ఒంటిపై 20 కత్తిపోట్లు

కూకట్ పల్లిలో సహస్ర హత్య కేసు.. వీడని మిస్టరీ..బాలిక ఒంటిపై 20 కత్తిపోట్లు
  • గ్రౌండ్ ఫ్లోర్​లో ఉంటున్న వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు
  • క్షుద్ర పూజల కోణంలోనూ ఎంక్వైరీ
  • నిందితుల కోసం రంగంలోకి ఐదు పోలీసు బృందాలు
  • కూకట్​పల్లిలో 11 ఏండ్ల సహస్ర హత్య కేసులో వీడని మిస్టరీ
  • గ్రౌండ్ ఫ్లోర్​లో ఉంటున్న వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు
  • క్షుద్ర పూజల కోణంలోనూ ఎంక్వైరీ

కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్​లోని కూకట్​పల్లిలో దారుణ హత్యకు గురైన 11 ఏండ్ల సహస్ర కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల కోసం 5 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సహస్ర శరీరంపై 20 కత్తి పోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కత్తి మాదిరి ఓ పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు పోలీసులు చెప్తున్నారు. మెడపై 15, పొట్ట మీద 5 కత్తిపోట్లను గుర్తించారు. హత్య జరిగిన బిల్డింగ్​కు సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ.. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవి ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బిల్డింగ్​లోని వాళ్లే ఎవరైనా సహస్రను హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్డింగ్​లో మొత్తం 6 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరందరినీ ఇప్పటికే పోలీసులు విచారించారు.

బిల్డింగ్ నుంచి బయటికెళ్లిపోయిన జాగిలాలు

బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్​లో  నివాసం ఉంటున్న సంజయ్ అనే వ్యక్తిపై అనుమానం ఎక్కువగా ఉండటంతో పోలీసులు అతన్ని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఉద్యోగం లేకపోవడంతో కొంత కాలంగా సంజయ్ ఇంట్లోనే ఉంటున్నాడు. సోమవారం ఇతని భార్య పనికి, పిల్లలు స్కూల్​కు వెళ్లగా అతను ఇంట్లోనే ఉన్నాడు. హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. సంజయ్ అప్పుడే తన బట్టలు ఉతికి ఆరేసినట్టు గుర్తించారు. తనకు ఆరోగ్యం బాగాలేక ఒడిశా వెళ్లి తాయత్తు కట్టించుకుని వచ్చానని పోలీసులకు చెప్పాడు. దీంతో క్షుద్ర పూజల కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పోలీసులు రప్పించిన జాగిలాలు హత్య జరిగిన ప్రదేశం నుంచి బిల్డింగ్ బయటకు వెళ్లాయే తప్ప అదే బిల్డింగ్​లోని ఏ ఇంటికీ వెళ్లలేదు. దీంతో హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది తేలడం లేదు. 

ఇంకా దొరకని మర్డర్ వెపన్

హత్యకు ఉపయోగించిన వెపన్ పై కూడా చర్చ జరుగుతున్నది. సహస్రను చంపేందుకు పెద్ద కత్తి వాడలేదని, షార్ప్​గా ఉండే చిన్న కత్తి లాంటి ఆయుధాన్నే ఉపయోగించారని తెలుస్తున్నది. వెపన్ ఇప్పటి దాకా పోలీసులకు దొరకలేదు. తమ ఇంట్లో 3 కత్తులు ఉండాలని, హత్య తర్వాత 2 కత్తులే కనిపిస్తున్నాయని సహస్ర తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇదే నిజమైతే నిందితులు ఇంట్లోకి చొరబడి అక్కడే ఉన్న కత్తితో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. బాలిక మీద అత్యాచారం చేసినట్లు ఎలాంటి ఆధారాల్లేవని పోలీసులు చెప్తున్నారు.