హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో శ్రీనివాస్ (52) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. భార్య, ఇద్దరు పిల్లలు కలిసి గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనివాస్, ఆయన భార్య రమాదేవి గత ఆరు నెలలుగా మచ్చ బొల్లారం పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చడంతో రమాదేవి తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీనివాస్‌పై గొడ్డలితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటనపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించి కేసు నమోదు చేశారు. ఘటనకు కుటుంబ కలహాలే కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి శ్రీనివాస్ భార్య రమాదేవితో పాటు ఆమె కుమారుడు నిఖిల్, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
