బతుకమ్మ పూల కోసం వెళ్లి సెప్టిక్ ట్యాంకులో పడి వ్యక్తి మృతి

బతుకమ్మ పూల కోసం వెళ్లి సెప్టిక్ ట్యాంకులో పడి వ్యక్తి మృతి

ఎల్బీనగర్, వెలుగు: బతుకమ్మ కోసం పూలు, జిల్లేడు ఆకులు తేవడానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‎లో పడి మృతిచెందాడు. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం షేర్ గూడకు చెందిన అశోక్ రెడ్డి(50) కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి హయత్ నగర్ లోని కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన ఇద్దరు కొడుకులు ఉండగా విదేశాల్లో ఉంటున్నారు. 

కాలనీలోని ఓ అపార్ట్​మెంట్‎లో భార్యతో కలిసి ఉంటున్నాడు. సోమవారం బతుకమ్మ వేడుకలు ఉండడంతో ఉదయం 7:30 గంటలకు పూలు, జిల్లేడు ఆకులను తేవడానికి అపార్ట్​మెంట్ ముందు ఓపెన్ ప్లేస్‎కు వెళ్లాడు. అక్కడ జిల్లేడు ఆకులు తెంపుతుండగా మూత ఓపెన్ చేసి ఉన్న సెప్టిక్ ట్యాంక్‎లో పడి మృతిచెందాడు. హైడ్రా, డిజాస్టర్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు.

మృతదేహాన్ని వెలికి తీశాక చేతిలో బతుకమ్మ కోసం తెంపిన పూలు, ఆకులు ఉండటం చూసిన స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు. 1987లో ఇక్కడ లే అవుట్ వేయగా 200 గజాల స్థలంలో డ్రైనేజీ కోసం 20 మీటర్ల లోతులో వెంచర్ నిర్వాహకులు సెప్టిక్ ట్యాంక్ కట్టారు. దీనికి మూడు మూతలు పెట్టారు. అదే ప్రదేశంలో తంగేడు, జిల్లేడు చెట్లు ఉన్నాయి. వాటిని తెంపుతుండగా ఈ ఘటన జరిగింది.