
హైదరాబాద్: బతుకమ్మ పండుగ వేళ హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. బతుకమ్మ పూల కోసం వెళ్లి ఓ వ్యక్తి సెప్టెక్ ట్యాంక్లో పడి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం షేర్ గూడ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి గత కొంత కాలంగా హయత్ నగర్ కమర్షియల్ టాక్స్ కాలనీలో ఫ్యామిలీ కలిసి నివాసం ఉంటున్నాడు. అశోక్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సోమవారం (సెప్టెంబర్ 29) సద్దుల బతుకమ్మ కావడంతో పూల కోసమని అశోక్ రెడ్డి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఓ వెంచర్లో ఉన్నా సెప్టెక్ ట్యాంక్ గుంతలో పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. అశోక్ రెడ్డి ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడిని వెతుక్కుంటూ వెళ్లారు కుటుంబ సభ్యులు. అనుమానం వచ్చి సెప్టెక్ ట్యాంక్ గుంతలో చూడగా అశోక్ రెడ్డి విగతజీవిగా పడి ఉన్నాడు.
కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ సెప్టెక్ ట్యాంగ్ గుంత నుంచి అశోక్ రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. పూల కోసమని బయటకు వెళ్లి అశోక్ రెడ్డి మరణించడంతో పండగ వేళ మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అశోక్ రెడ్డి మృతదేహన్ని పట్టుకుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.