కొరియర్ బాయ్ నంటూ ఇంట్లోకి వచ్చి..యువతిపై అత్యాచారం

కొరియర్ బాయ్ నంటూ ఇంట్లోకి వచ్చి..యువతిపై అత్యాచారం
  • కొరియర్ బాయ్ నంటూ ఇంట్లోకి వచ్చి..యువతిపై అత్యాచారం
  • ఆపై సెల్ఫీ తీసుకుని బెదిరింపులు.. పుణెలో ఘటన
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

ముంబై: మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన వెలుగు చూసింది. కొరియర్ డెలివరీ బాయ్‌‌‌‌‌‌‌‌ని అంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెతో సెల్ఫీలు దిగాడు. లైంగిక దాడి గురించి ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను లీక్ చేస్తానని బాధితురాలిని బెదిరించాడు. ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్న యువతి(22).. తన సోదరుడితో కలిసి కోంధ్వా ఏరియాలోని ఓ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నది. 

బుధవారం రాత్రి 7.30 గంటలకు ఓ వ్యక్తి.. యువతి ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ దగ్గరకు వచ్చి తలుపు తట్టాడు. ఓ కవర్ చేతిలో పట్టుకుని కొరియర్  డెలివరీ బాయ్‌‌‌‌‌‌‌‌నని చెప్పాడు. సోదరుడు ఇంట్లో లేకపోవడంతో యువతి తలుపులు తీసింది. బ్యాంకు నుంచి కొరియర్ వచ్చిందని..సంతకం చేసి కవర్ తీసుకోవాలని నిందితుడు కోరాడు. పెన్ కోసం యువతి వెనక్కి తిరగగానే..నిందితుడు కూడా ఆమె వెంట సైలెంట్ గా ఇంట్లోకి దూరాడు. యువతి మొహంపై ఓ కెమికల్ ను స్ప్రే చేశాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అనంతరం నిందితుడు బాధితురాలి ఫోన్‌‌‌‌‌‌‌‌తో సెల్ఫీ తీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే సెల్ఫీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని.. మళ్లీ కలుద్దామని బెదిరింపు మెసేజ్ చేసి వెళ్లిపోయాడు. రాత్రి 8.30 గంటలకు స్పృహలోకి వచ్చిన యువతి.. పోలీసులకు, బంధువులకు సమాచారం అందించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. పది బృందాలతో అతడి కోసం గాలిస్తున్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని పేర్కొన్నారు.