డమ్మీ బాంబుతో బ్యాంకులో అగంతకుడి హల్​చల్

డమ్మీ బాంబుతో బ్యాంకులో అగంతకుడి హల్​చల్
  • బ్యాంకులో అగంతకుడి హల్​చల్
  •  చెరుకు గడలకు టేపులు చుట్టి... టీవీ బోర్డుతో భయపెట్టిండు 
  •  చాకచక్యంగా పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది 

జీడిమెట్ల, వెలుగు : ‘ఏయ్..అందరూ నా ఒంటిపై ఉన్న బాంబులు చూడండి...నేను మానవ బాంబుని..మర్యాదగా నేనడిగిన పైసలు, డబుల్​ బెడ్​రూం ఇల్లు ఇస్తే సరే..లేకపోతే పేల్చేసుకుంటా..నాతో పాటు మీరందరూ చస్తరు. పైసలు కావాలా? ప్రాణాలు కావాలా?’ అంటూ ఓ వ్యక్తి హైదరాబాద్​లోని జీడిమెట్ల పీఎస్​ పరిధిలోని బ్యాంకులో హల్​చల్​ చేశాడు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది కథనం ప్రకారం..షాపూర్​నగర్ ​సంజయ్​గాంధీనగర్​కి చెందిన శివాజీ  క్రేన్​ డ్రైవర్. శుక్రవారం సాయంత్రం నాలుగన్నర గంటల ప్రాంతంలో డమ్మీ బాంబులను ఒంటికి తగిలించుకుని షాపూర్​నగర్​లోని ఆదర్శ్ ​బ్యాంక్​కి వెళ్లాడు. బ్యాంకు ఫస్ట్ ​ఫ్లోర్​లో ఉండగా, డమ్మీ బాంబులను షర్ట్​తో కవర్​ చేసుకుని సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి చొరబడ్డాడు. తర్వాత షర్ట్ ​బటన్స్​విప్పేసి తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందికి ఓ సంచి ఇచ్చాడు. అలాగే తనకు డబుల్​ బెడ్​రూం ఇల్లు కూడా కావాలని డిమాండ్​ పెట్టాడు. తాను చెప్పినట్టు చేయకపోతే పేల్చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఎక్కడి వారు అక్కడే కూర్చుండిపోయారు.

ఎప్పుడు బాంబు పేలుస్తాడోనని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఒకరు తెలివిగా అలారం బటన్ ​ప్రెస్ ​చేయడంతో కింది ఫ్లోర్​లో ఉన్న ఏటీఎం దగ్గర, బ్యాంకు బయట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అలర్టయ్యారు. వెంటనే బ్యాంకు గ్రిల్స్ ​గేటుకు తాళవేశారు. కొద్దిసేపటి వరకు అతడి వాలకం గమనించగా ఏదో తేడా అనిపించింది. కొద్దిసేపటికి తాళం తీసి మాట్లాడుతూ వెళ్లి పట్టుకున్నారు. తర్వాత జీడిమెట్ల పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణలో అతడు ధరించింది డమ్మీ బాంబుగా తేలింది. చెరుకు గడలకు టేపులు చుట్టి, టీవీ బోర్డులను పెట్టుకుని భయపెట్టాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.