- మూడేండ్ల కాలంలో ఎనిమిది మంది డీసీవోలు
- ఇద్దరే రెగ్యులర్.. అందులో ఒకరు ఏసీబీకి చిక్కి జైలుకు
- మిగతా ఆరుగురు ఇన్‌చార్జీలే..
- మరోసారి ఇన్చార్జ్ డీసీవోకే బాధ్యతలు
మంచిర్యాల, వెలుగు: సహకార సంఘాల రిజిస్ట్రేషన్లు, పర్యవేక్షణ, ఆడిటింగ్‌తో పాటు రైతులకు లోన్లు మంజూరు, విత్తనాలు, ఎరువుల సప్లై, ధాన్యం కొనుగోళ్లు వంటి విస్తృతమైన కార్యకలాపాలు జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి. అంతటి ముఖ్యమైన విధులు నిర్వహించే శాఖకు మంచిర్యాలలో సారథి కరువయ్యారు. గత కొన్నేండ్లుగా రెగ్యులర్డీసీవో లేకపోవడం, మూన్నెళ్లు, ఆర్నెళ్లకో అధికారి మారడంతో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఇన్చార్జి డీసీవోలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో శాఖపై పర్యవేక్షణ కొరవడింది.
మూడేండ్ల వ్యవధిలో ఏకంగా ఎనిమిది మంది డీసీవోలు మారారంటే ఆ డిపార్ట్మెంట్పనితీరు ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ మూడేండ్ల కాలంలోనూ ఇద్దరు రెగ్యులర్డీసీవోలు పనిచేయగా, అందులో ఒకరు ఏసీబీకి చిక్కారు. మిగిలిన ఆరుగురు ఇన్‌చార్జిలే. ఈసారైనా రెగ్యులర్ డీసీవో రాకపోతారా అని అంతా ఎదురుచూశారు. కానీ తాజాగా మళ్లీ ఇన్చార్జి డీసీవోకే బాధ్యతలు అప్పగించడంతో అన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
2023 నుంచి ఇన్‌చార్జిలే..
2016 అక్టోబర్‌లో జిల్లాల పునర్విభజనలో భాగంగా మంచిర్యాల కొత్త జిల్లాగా ఆవిర్భవించడంతో డీసీవోగా సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన 2020 ఏప్రిల్ వరకు పనిచేసి వరంగల్జిల్లాకు బదిలీ అయ్యారు. సంజీవరెడ్డి స్థానంలో సిరిసిల్లకు చెందిన కృష్ణ డీసీవోగా వచ్చారు. ఆయన 2023 ఆగస్టు 24 వరకు పనిచేసి బదిలీపై వెళ్లారు. రెగ్యులర్ అధికారులు ఒకరు నాలుగేండ్లు, మరొకరు మూడేండ్లు పనిచేయడంతో అంతా సవ్యంగా సాగింది. ఆ తర్వాత నిర్మల్ డీసీవో శ్రీనివాస్ రెడ్డికి మంచిర్యాల ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఆయన నిర్మల్ నుంచి బదిలీ కావడంతో ఆ స్థానంలో వచ్చిన నర్సయ్య ఇన్చార్జి డీసీవోగా కొంతకాలం వ్యవహరించారు. ఆయన తర్వాత పెద్దపల్లి డీసీవో రామ్మోహన్ ఇన్చార్జిగా వచ్చారు.
అనంతరం జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్లలో సంజీవరెడ్డి మరోసారి రెగ్యులర్ డీసీవోగా నియమితులై రిటైర్ అయ్యేదాక పనిచేశారు. ఆ తర్వాత ఆదిలాబాద్ డీసీవో మోహన్‌కు ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. అనంతరం రెగ్యులర్డీసీవోగా వచ్చిన రాథోడ్ బిక్కు బాధ్యతలు చేపట్టిన 20 రోజులకే ఏసీబీ ట్రాప్‌లో చిక్కారు. ఆసిఫాబాద్ఇన్చార్జి డీసీవోగా ఉన్న ఆయన ఆ జిల్లాకు చెందిన ఒక పీఏసీఎస్ సెక్రటరీ నుంచి రూ.5లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుకు వెళ్లారు. బిక్కు తర్వాత జగిత్యాల డీసీవో సత్యనారాయణ ఇన్చార్జిగా రాగా, తాజాగా ఆసిఫాబాద్ డీసీవో కరుణాకర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇక్కడ ఎంతకాలం కొనసాగుతారోనని సహకార శాఖ వర్గాల్లో చర్చమొదలైంది.
గాడితప్పిన పాలన
ఇన్చార్జి డీసీవోల పాలనలో జిల్లా సహకార శాఖ గాడి తప్పుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జిల్లా కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి పంట రుణాలు అందించడం, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటుంది. సహకార సంఘాల నమోదు, పర్యవేక్షణలో భాగంగా రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, కల్లుగీత, చేనేత కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, హౌసింగ్, లేబర్ సొసైటీలను రిజిస్టర్ చేయడం, వాటిని కంట్రోల్ చేయడంతో పాటు వార్షిక ఆడిట్ నిర్వహిస్తుంది.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల(డీసీసీబీ) ద్వారా గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు అందించడం వంటి విధులు నిర్వహిస్తుంది. ఈ శాఖకు రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇన్చార్జిలుగా వచ్చినవారు నామమాత్రంగా పనిచేస్తున్నారు. వారానికి ఒకటి రెండుసార్లు వచ్చి పెండింగ్ ఫైళ్లపై సంతకాలు చేసి వెళ్తున్నారు. సహకార సంఘాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో భారీగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. ఆడిటింగ్‌లోనూ అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. సంఘాల రిజిస్ట్రేషన్లతో పాటు పలు ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నాయి.
