- ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3,352 మంది సర్కారు బడులలో చేరిక
మంచిర్యాల, వెలుగు: ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఏసీఎల్బీ, ఇన్చార్జి డీఈవో పి.చంద్రయ్యతో కలిసి యూ డైస్ పోర్టల్‌లో ఈ నెల 25 నాటి విద్యార్థుల నమోదు నివేదికను శనివారం విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరంలో గవర్నమెంట్ స్కూళ్లలో నమోదైన విద్యార్థుల సంఖ్య కంటే పది శాతం అదనపు విద్యార్థులను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించిందని కలెక్టర్ తెలిపారు.
గత విద్యా సంవత్సరం జిల్లాలో 43,072 మంది విద్యార్థులు ఉండగా, ఈ విద్యా సంవత్సరానికి 47,379 మంది విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వస్కూళ్లలో 45,350 మంది విద్యార్థులు నమోదయ్యారని, గతేడాదితో పోలిస్తే ఇప్పటికే 2,278 మంది అదనంగా చేరారని, దీనితో పది శాతం అదనపు నమోదు లక్ష్యంలో 95.72 శాతం సాధించి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 2వ స్థానంలో, జగిత్యాల జిల్లా 3వ స్థానంలో ఉన్నాయన్నారు. జిల్లాలోని 275 స్కూళ్లు గతేడాది కంటే పది శాతానికి మించి నమోదును సాధించాయని తెలిపారు.
సర్కారు బడిలోనే చేర్పించాలి
జులై 23 నాటి యు డైస్ గణాంకాల ప్రకారం జిల్లాలోని వివిధ ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3,352 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరారని, ఇది ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హతలున్న టీచర్లు, స్మార్ట్ టీవీలు, ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడులలో చేర్పించాలని కోరారు.
