- సంఘం అధ్యక్షుడిగా మంగదొడ్డి శ్రీనివాసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సెక్రటేరియెట్ లోని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో అధికారులు అధికారికంగా ఎన్నిక పత్రాలను నూతన బాధ్యులకు అందజేశారు. సంఘం అధ్యక్షుడిగా మంగదొడ్డి శ్రీనివాసులు (ఎస్ఓ, బీసీ వెల్ఫేర్), ప్రధాన కార్యదర్శిగా టి. వెంకటరమణ (ఎస్ఓ, ఐటీ అండ్ క్యాడ్), అడిషనల్ సెక్రటరీగా జి. శ్రవణ్ కుమార్ (ఎస్ఓ, జీఏడీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా ఉడుత అశోక్, జి. లావణ్య లత, జాయింట్ సెక్రటరీలుగా అంబటి వీరాంజనేయులు, కూరపాటి ఆశాజ్యోతి, కమటం తిరుపతి, బి. రామ్ గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి. సైదులు, పబ్లిసిటీ సెక్రటరీగా ఎస్. రామలింగయ్య, కోశాధికారిగా కాదరి నవీన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎన్నికల పత్రాలు అందుకున్న నూతన కార్యవర్గ సభ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలేల ఆశయాలకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సచివాలయంలో బీసీ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, ప్రమోషన్లు, ఇతర సేవా సమస్యలపై నిరంతరం గళం విప్పుతామని, 2025 బ్యాచ్ యువ ఉద్యోగులను కలుపుకుంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, వెంకట్ రమణ సంయుక్తంగా ప్రకటించారు. కాగా, ఈ ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఎన్నికల అధికారులు చిక్కా లక్ష్మణ్, కె. రమాదేవి, రెండ్ల రాజేశ్, ఎం. రవీంద్ర కుమార్, వి. కైలాసం, బి. స్వామి గౌడ్‌లను నూతన కార్యవర్గం, బీసీ ఉద్యోగులు అభినందించారు.
