మైక్రో ఫైనాన్స్ కేసు.. మంగ్లీ తమ్ముడి అకౌంట్కు డబ్బులు!

మైక్రో ఫైనాన్స్ కేసు.. మంగ్లీ తమ్ముడి అకౌంట్కు డబ్బులు!
  • ఏ1 రమావత్ మధు నుంచి మూడుసార్లు ట్రాన్స్​ఫర్ 
  • గుర్తించిన సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు 
  •  ఇతర నిందితుల అకౌంట్స్ వివరాల కోసం బ్యాంక్​లకు  లేఖ

గచ్చిబౌలి, వెలుగు: సింగర్ మంగ్లీ పేరుతో బయటకు వచ్చిన మైక్రో ఫైనాన్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె తమ్ముడు శివ చౌహన్ బ్యాంక్ అకౌంట్స్​ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు గురువారం పరిశీలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు తన అకౌంట్లలోకి డబ్బులు రాగానే, మరుసటి రోజు ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసి ఇతర అకౌంట్లకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే మధు బ్యాంక్ అకౌంట్స్ నుంచి శివ చౌహన్ అకౌంట్​కు మూడుసార్లు డబ్బులు వచ్చినట్లు నిర్ధారించారు.

దీంతో అప్రమత్తమైన సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు వెంటనే మధు అకౌంట్లను సీజ్ చేశారు. అలాగే, ఈ కేసుతో ముడిపడి ఉన్న మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహన్ ల బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు సైబరాబాద్ పోలీసులు లేఖలు రాశారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో అధిక వడ్డీ ఇస్తామని సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు కోట్లాది రూపాయలు వసూలు చేశారని, అడిగితే బెదిరింపులకు దిగారని ఇటీవల న్యాయవాది సుబ్బారావు పంజాగుట్టలో ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అధిక వడ్డీ పేరుతో డబ్బులు వసూలు చేసి, భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మోసం చేసిన కేసులో ఇటీవల రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు  అరెస్ట్ చేశారు.