పూత ఫుల్.. కాత నిల్..మామిడి కాతను దెబ్బతీసిన తెగుళ్లు, అకాల వానలు

పూత ఫుల్.. కాత నిల్..మామిడి కాతను దెబ్బతీసిన తెగుళ్లు, అకాల వానలు
  • 3.3 లక్షల ఎకరాల్లో దిగుబడిపై తీవ్ర ప్రభావం  
  • ఆగిన విదేశీ ఎగుమతులు.. ఆందోళనలో రైతులు

హైదరాబాద్‌, వెలుగు : రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ సారి రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో గతంలో ఎన్నడూ లేనంతగా పూత వచ్చింది. కానీ నెల రోజుల్లోనే పరిస్థితులు మారిపోవడంతో పూత, పిందెలు రాలి తోటలు వెలవెలబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఎకరాల్లో సాగవుతున్న మామిడిపై తీవ్ర ప్రభావం పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సారి దిగుబడి సగానికి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు, ఉద్యానవన శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు 

వాతావరణ మార్పులు.. రాలిపోయిన పూత

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.3 లక్షల ఎకరాల్లో బంగినపల్లి, దశరి, హిమాయత్, చిన్నరసం, తోతాపురి, నీలం వంటి మామిడి వెరైటీలు సాగవుతున్నాయి. డిసెంబర్‌-, జనవరి, ఫిబ్రవరి నెలల్లో తోటలు విరగబూశాయి. పూతతో కళకళలాడిన తోటలను చూసి రైతులు సంబరపడ్డారు. కానీ తెగుళ్లు, చీడపీడలు, అకాల వర్షాలు, పొగమంచు, మబ్బులు, రాత్రి ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా పూత చాలా వరకు రాలిపోయింది. పిందెలు, లేతకాయలు కింద పడిపోతున్నాయి. ‘గత నెలలో పూత ఫుల్‌గా వచ్చింది. ఈ సారి కాపు ఎక్కువగా ఉంటుందని ఆశపడ్డాం.

కానీ పొగమంచు, అకాల వానలతో అంతా రాలిపోయింది’ అని ఖమ్మం జిల్లాకు చెందిన రైతు వీరభద్రం వాపోయారు. మహబూబాబాద్, వరంగల్, నాగర్‌కర్నూల్‌, జగిత్యాల, ఖమ్మం‌, మంచిర్యాల‌, కొల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి -భువనగిరి జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సాధారణంగా ఎకరానికి ఐదు టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ సారి రెండు టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముంచిన తేనెమంచు, నల్ల తామర

తేనెమంచు (హనీ డ్యూ) పురుగులు వదిలే తీపి ద్రవం ఆకులపై పేరుకుపోయి బ్లాక్ ఫంగస్ (బూడిద తెగులు) ఏర్పడుతోంది. నల్ల తామర (బ్లాక్ థ్రిప్స్‌) పూత, పిందెలు, లేత కాయలను దెబ్బతీస్తోంది. కొల్లాపూర్‌లో నాలుగేళ్లుగా ఈ తెగుళ్లు వదలకుండా వేధిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట పండినా.. తెగుళ్లు, వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గి రూ.లక్షల్లో పెట్టుబడి నష్టపోతున్నారు. ‘ఎన్ని మందులు కొట్టినా ఫలితం లేదు. పూత నిలవడం లేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు, అధిక తేమ వల్ల థ్రిప్స్‌, హాపర్స్‌ సంఖ్య పెరిగింది. ఇవి పిందెలు రాలడానికి కారణమవుతున్నాయి. 

ఆగిపోయిన ఎగుమతులు.. 

మామిడి దిగుబడి తగ్గడంతో పాటు విదేశీ ఎగుమతులు కూడా ఆగిపోయాయి. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి మూసుకుపోవడం, గల్ఫ్​దేశాలకు విమానాల రద్దు, ఎయిర్‌ వేస్ ఛార్జీల పెరుగుదలతో గల్ఫ్, యూరప్, అమెరికా మార్కెట్లకు ఎగుమతులు స్తంభించాయి. కొల్లాపూర్ మామిడి, ఏపీ నూజివీడు వెరైటీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

దీంతో లక్షల టన్నుల పల్ప్ నిల్వలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఎగుమతి ఆగిపోతే ధరలు పడిపోతాయని, పంట అమ్మకాలకు ఇబ్బంది ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. హార్టికల్చర్​అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేసి పంట నష్టం చెల్లించాలని కోరుతున్నారు.