
అటెండ్కాని నెట్టా డిసౌజా, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి
అందుబాటులో ఉన్న నేతలతోనే సమావేశం
హైదరాబాద్, వెలుగు: గాంధీభవన్‌లో మంగళవారం మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు నెట్టా డిసౌజా, ఏఐసీసీ స్టేట్ ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరవుతారని తొలుత ప్రకటించారు. కానీ, వారు సమావేశానికి అటెండ్ కాలేదు. ఉదయం 11.30 గంటలకు సమావేశం జరగాల్సి ఉన్నా.. సాయంత్రమైనా వారు రాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫోన్ ద్వారా నెట్టా డిసౌజా తన మెసేజ్ పంపించారని చెప్పాయి.
దీంతో అందుబాటులో ఉన్న నేతలతోనే సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల బ్రోచర్‌ను రోహిత్ చౌదరి ఆవిష్కరించారు. రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ పోటీల్లో ఎక్కువ మంది మహిళలు పాల్గొనేలా పనిచేయాలని కార్యకర్తలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు సూచించారు. పోటీలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. 16 ఏండ్ల నుంచి 35 ఏండ్ల వయసున్న వాళ్లంతా క్విజ్ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. 7661899899 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.