ఇక్కడా కర్నాటక తరహాలోనే గెలుస్తం

ఇక్కడా కర్నాటక తరహాలోనే గెలుస్తం

హైదరాబాద్, వెలుగు: కర్నాటక తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్  అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్‌ రావ్  ఠాక్రే అన్నారు. ఠాక్రే నేతృత్వంలో శుక్రవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ.. ఖమ్మం సభతో కాంగ్రెస్‌లో మంచి ఊపు వచ్చిందన్నారు. పక్కా ప్రచార వ్యూహంతో ముందుకు వెళ్తే, భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయచ్చని పార్టీ శ్రేణులకు సూచించారు. నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు వేసుకుని ప్రచారం ప్రారంభించాలని, పార్టీ అధికారంలో వస్తే ఏమేం చేస్తామో ప్రజలకు వివరించాలన్నారు. ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీకి మంచి అనుభవం ఉందని, ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ ప్రచార వ్యూహంతో ముందుకు వెళ్తుందన్నారు. అలాగే బీఆర్‌‌ఎస్  అవినీతి, అరాచకాలను సైతం ప్రజలకు వివరించాలన్నారు. 

బీజేపీ, బీఆర్‌‌ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని ఎండగట్టాలని ఠాక్రే కోరారు. మధు యాష్కీ మాట్లాడుతూ బీఆర్‌‌ఎస్, బీజేపీ తోడు దొంగలని ఆరోపించారు. ఎన్నికల భయంతోనే కేసీఆర్  రుణమాఫీ ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై త్వరలోనే పోస్టు కార్డు ఉద్యమం చేపడతామన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలనూ సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని, తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఫైరయ్యారు. ప్రచార కమిటీ సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాహుల్  గాంధీ కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపై కాంగ్రెస్  నేతలు హర్షం వ్యక్తం చేశారు.