- ఇయ్యాల రాష్ట్రానికి ఠాక్రే
- ఉమ్మడి నల్లగొండ, ములుగు, వరంగల్ జిల్లాల్లో టూర్
- శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో వరుస మీటింగ్స్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మంగళవారం రాష్ట్రానికి వస్తున్న ఆయన.. ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ.. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతోపాటు నల్లగొండ లోక్‌సభ సెగ్మెంట్ ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతారు. అదే రోజు హాత్‌సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ములుగు వెళ్తారు. ఇటీవల మరణించిన డీసీసీ ప్రెసిడెంట్ కుమారస్వామి కుటుంబాన్ని గురువారం పరామర్శిస్తారు. అక్కడి నుంచి వరంగల్ వెళ్లి బీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడిన యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్‌ను పరామర్శిస్తారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 86వ జయంతి వేడుకల్లోనూ పాల్గొంటారు. అదే రోజు హైదరాబాద్ చేరుకుంటారు. శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ ఇన్చార్జ్ కార్యదర్శులు, ముఖ్య నేతలతో సమావేశమవుతారు. శనివారం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ, పార్టీ మండల అధ్యక్షులతో సమావేశం కానున్నారు.

