
ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లు కంట్రోల్ చేసి శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని 21 మందితో కూడిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీల బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలలుగా హింస కొనసాగుతున్నా పట్టించుకోలేదని మండిపడింది. వీటన్నింటికీ మించి.. ప్రధాని నరేంద్ర మోదీ మౌనం సహించలేని విధంగా ఉందంటూ గవర్నర్ అనుసూయ ఉయికేకు సమర్పించిన మెమొరాండమ్‌లో పేర్కొంది. మణిపూర్‌లో రెండు రోజుల పాటు పర్యటించిన బృందం.. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి వినతిపత్రం అందజేసింది. దీనిపై 21మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉభయ సభల్లో మోదీ మాట్లాడాలి
‘‘కొన్ని రోజులుగా కాల్పులు ఆగడం లేదు. ఇండ్లు తగలబడుతున్నాయి. మూడు నెలలుగా హింసను నియంత్రించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందనేది స్పష్టమవుతున్నది. ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. దీంతో రూమర్స్ పెరిగిపోయాయి. ప్రజలకు నిజాలేంటో తెలియడం లేవు. ఇది రెండు వర్గాల మధ్య మరిన్ని హింసాత్మక ఘటనలకు దారి తీస్తున్నది” అని ఎంపీలు మెమొరాండమ్‌లో పేర్కొన్నారు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ మౌనం.. ఉదాసీనతకు ఉదాహరణగా మారిందని విమర్శించారు. ఉభయ సభల్లో మాట్లాడాలని డిమాండ్ చేశారు.
జోక్యం చేసుకునేలా చూడాలి
‘‘మణిపూర్‌లో శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించాలి. దీని కోసం వెంటనే బాధిత ప్రజలకు పునరావాసం కల్పించి జీవితంపై భరోసా ఇవ్వాలి. ఇదే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఇక్కడ న్యాయం అనేది మెయిన్ పిల్లర్‌గా ఉండాలి” అని గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో ఎంపీలు కోరారు.
రిలీఫ్ క్యాంపుల్లో సౌలతుల్లేవు
‘‘అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి రెండు వర్గాల ప్రజలు పడిన కష్టాలు విన్నాం. రిలీఫ్ క్యాంపుల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. కనీస సౌకర్యాలు లేవు” అని ఎంపీలు వివరించారు. తర్వాత గవర్నర్‌కు సమర్పించిన మెమొరాండమ్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఢిల్లీ తిరుగుప్రయాణం అయ్యారు. కాగా, మణిపూర్ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే, దేశ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఎంపీల బృందం హెచ్చరించింది.