లిక్కర్ స్కాం కేసు.. బెయిలు కోసం సుప్రీంకు సిసోడియా

లిక్కర్ స్కాం కేసు.. బెయిలు కోసం సుప్రీంకు సిసోడియా

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో బెయిల్ కోసం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సిసోడియా గతంలో బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. దీంతో సీబీఐ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా.. నిరాశే మిగిలింది.

 ఇదే సందర్బంలో.. మల్టిపుల్ స్క్లిరోసిస్‌‌ వ్యాధితో బాధపడుతోన్న తన భార్య అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ కూడా జులై 3న  రిజెక్ట్ అయింది. అలాగే ఈడీ కేసులో సహ నిందితులు అభిషేక్ బోయిన్‌‌పల్లి, బినోయ్ బాబు, విజయ్ నాయర్‌‌కూ బెయిల్‌‌ను తిరస్కరించారు. దీంతో ఈడీ, సీబీఐ కేసుల్లో హైకోర్టు బెయిల్ ను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సిసోడియా గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిసోడియా తరపున అడ్వకేట్ వివేక్ జైన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.