ఇక తవ్వాల్సిందే! పూర్తిగా పాడైపోయిన డ్రిల్లింగ్ మెషిన్ 

ఇక తవ్వాల్సిందే! పూర్తిగా పాడైపోయిన డ్రిల్లింగ్ మెషిన్ 

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్​లోని టన్నెల్​లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్​కు తరచూ అడ్డంకులు ఎదురవుతున్నాయి. టన్నెల్​కు సమాంతరంగా భారీ యంత్రంతో డ్రిల్లింగ్ చేపట్టిన అధికారులు.. దాదాపు 80% పనులు పూర్తిచేశారు. అయితే ఆఖరి దశలో అవాంతరాలు ఎదురయ్యాయి. ఇన్ని రోజులు అమెరికన్ ఆగర్ మెషిన్​తో డ్రిల్లింగ్ చేయగా, ఇప్పుడా యంత్రం డ్యామేజ్ అయింది. శిథిలాల్లోని ఇనుప రాడ్లు తగిలి మెషిన్ బ్లేడ్లు పాడైపోయాయి. వాటిని రిపేర్ చేయడం కష్టమని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. ఇకపై మాన్యువల్ డ్రిల్లింగ్ చేయాలని భావిస్తున్నారు. 

మొత్తం 60 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 46.8 మీటర్ల మేర పూర్తయింది. మిగిలిన 10 నుంచి 12 మీటర్ల మేర డ్రిల్లింగ్​ను మాన్యువల్​గా పూర్తిచేయాలని ఆలోచిస్తున్నారు. మరోవైపు, కొండ పైనుంచి నిట్టనిలువునా డ్రిల్లింగ్ చేసేందుకూ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం కొండపైకి వెళ్లేందుకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఇప్పటికే రోడ్డు వేసింది. అక్కడికి ఓ భారీ డ్రిల్లింగ్ యంత్రాన్ని శనివారం తరలించారు. డ్రిల్లింగ్ కోసం రెండు స్పాట్స్ ను కూడా నిపుణులు గుర్తించారు. అయితే మాన్యువల్ డ్రిల్లింగ్ అయినా, వర్టికల్ డ్రిల్లింగ్ అయినా టైమ్ ఎక్కువ పడుతుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. వర్టికల్ డ్రిల్లింగ్ కష్టమని అంటున్నారు.

ఇయ్యాల్టి నుంచి మాన్యువల్ డ్రిల్లింగ్: సీఎం 

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి శనివారం మరోసారి టన్నెల్ దగ్గరికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టన్నెల్​లో ఆగర్ మెషిన్ ఇరుక్కుపోయింది. దాన్ని బ్లేడ్లను కట్ చేసేందుకు ప్లాస్మా కట్టర్ కావాలి. ఈ కట్టర్​ను హైదరాబాద్ నుంచి విమానంలో తెప్పిస్తున్నాం. ఆదివారం నుంచి మాన్యువల్ 
డ్రిల్లింగ్ ప్రారంభిస్తాం” అని చెప్పారు.

డ్రిల్లింగ్ మెషిన్ పనిచేయదు: ఆర్నాల్డ్ డిక్స్ 

ఆగర్ మెషిన్ పూర్తిగా పాడైపోయిందని, ఇక పనిచేయదని ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్ పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ తెలిపారు. ‘‘ఆగర్ మెషిన్ డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేయలేం. మా దగ్గర ఇంకో ఆగర్ మెషిన్ లేదు. అందుకే ఇక మాన్యువల్, వర్టికల్ డ్రిల్లింగ్ పై ఫోకస్ చేస్తున్నాం” అని చెప్పారు. ‘‘కార్మికులు క్షేమంగా ఉన్నారు. వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఏది సక్సెస్ అవుతుందో చెప్పలేం” అని పేర్కొన్నారు.