కుటుంబాల్లో కరోనా కల్లోలం

కుటుంబాల్లో కరోనా కల్లోలం

బూర్గంపహాడ్, వెలుగు: కరోనా సోకిన తండ్రికి సేవలు చేసి.. ధైర్యం చెప్పిన కొడుకు చివరకు వైరస్​తో మృతిచెందాడు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్  మండలం మోతె పట్టీనగర్ గ్రామానికి చెందిన మోతే  వీరభద్రస్వామి ఆలయం మాజీ చైర్మన్ తాళ్లూరి శ్రీనివాసరావు 15 రోజుల క్రితం  కరోనా బారిన పడ్డారు. ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ సమయంలో శ్రీనివాసరావు కొడుకు తాళ్లూరి శ్రీకాంత్(30) తండ్రికి సేవలు అందించి ధైర్యం చెప్పాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం శ్రీకాంత్ కూడా కరోనా బారిన పడ్డాడు. హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్న తరుణంలో ఆదివారం ఉదయం ఆరోగ్యం విషమించి శ్రీకాంత్  మృతిచెందాడు. మృతుడికి గత ఏడాది పెండ్లయింది. శ్రీకాంత్​మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బూర్గంపహాడ్ సొసైటీ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, కుటుంబసభ్యులు పీపీటీ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.  

భర్త మృతి.. భార్య సూసైడ్

జీడిమెట్ల, వెలుగు: ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకడం.. భర్తకు సీరియస్​అవ్వడంతోమనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లోని జీడిమెట్ల పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. గణేశ్​నగర్, కల్పనా సొసైటీకి చెందిన కె. ఆదినారాయణ, కె.కనకదుర్గ భార్యభర్తలు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. 10 రోజుల క్రితం నలుగురికీ పాజిటివ్​అని తేలింది. తర్వాత ఆదినారాయణ హాస్పిటల్​లో అడ్మిట్ అయ్యారు. ఆదివారం ఉదయం అతనికి సీరియస్​గా ఉందని తెలిసి మనస్తాపం చెందిన కనకదుర్గ ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్​చేసుకుంది. ఆమె చనిపోయిన 15 నిమిషాలకు ఆదినారాయణ హాస్పిటల్​లో మృతిచెందారు.  

భయంతో యువకుడి ఆత్మహత్య​

కోదాడ, వెలుగు: వారం రోజులుగా జర్వం తగ్గకపోవడంతో కరోనానేమో అనే భయంతో ఓ యువకుడు చెరువులో దూకి సూసైడ్​చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కోదాడ సాయికృష్ణ థియేటర్‌‌‌‌ సమీపంలో ఉండే గునుగుంట్ల నవీన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌(28) పోస్టల్ ఉద్యోగి. నల్లొండ జిల్లా నిడమనూరులో పని చేస్తున్నాడు. కాగా నవీన్​కు వారం రోజులుగా తీవ్ర జ్వరం తగులుతోంది. కోదాడలోని ఇంట్లో ఉంటూ మెడిసిన్​ వాడుతున్నా తగ్గలేదు. కరోనా సోకిందేమోనని భయంతో ఆదివారం టౌన్​లోని పెద్దచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  
ఒక్కరోజు తేడాతో భార్యాభర్తల మృతి
నకిరేకల్, వెలుగు: ఒక్కరోజు తేడాతో భార్యభర్తలు కరోనాతో చనిపోయారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌ రోడ్డులో ఉండే కళమ్మ(62)కు వారం కింద కరోనా సోకడంతో నల్గొండలోని ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్​అయ్యింది. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. అదే రోజు ఆమె భర్త(70)కు టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో చేర్చించారు. ట్రీట్​మెంట్​తీసుకుంటూ ఆదివారం తెల్లవారు జామున చనిపోయారు.

కరోనాతో విలేకరి మృతి

మెట్​పల్లి, వెలుగు: కరోనాతో విలేకరి చనిపోయారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన బోనగిరి అరుణ్​కుమార్(38) నవ తెలంగాణ రిపోర్టర్. వారం క్రితం కరోనా సింప్టమ్స్​కనపడడంతో టెస్టు చేయించుకున్నారు. పాజిటివ్​అని తేలింది. పట్టణంలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్ లో ట్రీట్​మెంట్ తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత ఆక్సిజన్​లెవల్స్​తగ్గడంతో కరీంనగర్​లోని ప్రైవేట్​హాస్పిటల్​లో అడ్మిట్​అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అరుణ్​కుమార్ ​ప్రస్తుతం మెట్​పల్లి ప్రెస్​క్లబ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ సత్యనారాయణ తదితరులు అరుణ్ ​మృతికి సంతాపం ప్రకటించారు.

బీబీనగర్​లో తల్లిదండ్రులు, కొడుకు..

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా బీబీనగర్​మండలం నెమురగోములలో పది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు, కొడుకు కరోనాతో చనిపోయారు. గ్రామానికి చెందిన సురకంటి బాలమణి(70), సురకంటి చంద్రయ్య(75) భార్యాభర్తలు. వీరికొడుకు జంగయ్య(45). ఇటీవల బాలమణి, చంద్రయ్యకు కరోనా సోకడంతో జంగయ్య హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చేర్పించాడు. చికిత్స పొందుతూ బాలమణి మే1న మృతిచెందింది. చంద్రయ్య 3న చనిపోయాడు. ఆ తర్వాత జంగయ్య టెస్టు చేయించుకోగా పాజిటివ్​వచ్చింది. చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారుజామున జంగయ్య మృతిచెందాడు. ప్రస్తుతం జంగయ్య భార్యకి కరోనా పాజిటివ్​రావడంతో ట్రీట్​మెంట్​పొందుతున్నట్టు సమాచారం. జంగయ్యకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.