కంటి ఆసుపత్రిపై నిర్లక్ష్యం

కంటి ఆసుపత్రిపై నిర్లక్ష్యం
  • వరంగల్ రీజినల్ ఐ హాస్పిటల్ లో సమస్యల తిష్ట
  • మంజూరైన దాంట్లో సగం పోస్టులు ఖాళీ
  • శిథిలావస్థకు చేరిన బిల్డింగ్​ 
  • కాగితాలకే పరిమితం అవుతున్న ప్రపోజల్స్
  • పేదల దవాఖానపై దృష్టి పెట్టని లీడర్లు

హనుమకొండ, వెలుగు: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ప్రాంతీయ కంటి ఆసుపత్రిని సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. ఏటా వందల మందికి ట్రీట్ మెంట్లు, వేల మందికి కంటి చూపును ప్రసాదిస్తున్న దవాఖానను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పేషెంట్లకు సౌకర్యాలు  కల్పించడం లేదు. సిబ్బంది కొరత వేధిస్తోంది. సాంక్షన్ చేసిన సగం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. కంటి వెలుగు పేరున కళ్లద్దాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. ఎంతోమందికి కంటి చూపును ప్రసాదిస్తున్న ఈ హాస్పిటల్​ను మాత్రం విస్మరిస్తోంది.

స్వరాష్ట్రంలోనూ చిన్నచూపే..

1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కర్నూలు, విశాఖపట్నం, వరంగల్ లో మాత్రమే రీజినల్ ఐ హాస్పిటల్స్ ను ఆనాటి సర్కారు నెలకొల్పింది. కర్నూలు, విశాఖపట్నంలోని ఆసుపత్రులు కాలక్రమేణా అప్​ గ్రేడ్​ అయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా మారాయి. వరంగల్ లోని ఆసుపత్రి మాత్రం మూడు దశాబ్దాలు దాటినా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ ఆసుపత్రిలో 75 బెడ్లు ఉండగా నిత్యం 400 నుంచి 500 మందికిపైగా రోగులు వస్తున్నారు. రోజుకు 35 నుంచి 45 మంది ఇన్​ పేషెంట్లుగా చేరుతుంటారు.  ఈ హాస్పిటల్ ను 150 బెడ్లకు అప్ గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అమలు కాలేదు.

సగం స్టాఫ్​ ఖాళీ..

ఈ ఆసుపత్రిలో సౌకర్యాలతో పాటు సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. డాక్టర్లు, పారా మెడికల్, ఇతర సిబ్బంది సరిపోనంతగా లేరు. ఈ ఆసుపత్రికి 92 పోస్టులు మంజూరు చేయగా.. ప్రస్తుతం 52 మందే సేవలందిస్తున్నారు. మరో నలుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నలుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 20 హెడ్‌ నర్సెస్  పోస్టులు అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టు, హెల్త్ విజిటర్ల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. రిఫ్రాక్షనిస్టుల ఊసే లేదు. ఇక రిహాబిలిటేషన్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ప్లంబర్, డ్రైవర్, కార్పెంటర్, స్వీపర్స్, క్లీనర్స్ తదితర పోస్టులు కొన్నేండ్లుగా ఖాళీగానే ఉండడంతో ఉన్న కొద్దిమంది సిబ్బందిపైనే భారం పడుతోంది. 

ప్రతిపాదనలకే పరిమితం..

రీజినల్ ఐ హాస్పిటల్​ లో వైద్య పరికరాలు, మం దులు, ఇతర అవసరాలకు నిధుల కొరత వేధిస్తోంది. ఆసుపత్రిలో 4 యూనిట్లు ఉన్నా సరి పడా డాక్టర్లు లేరు. దశాబ్దాల నాటి  బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. ఆసుపత్రిలో గ్లకోమా, రెటీనా యూనిట్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిపై ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత నాలుగేండ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. కంటి వెలుగు పేరున అంధత్వ నివారణకు కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న లీడర్లు.. ఏటా వేల మందికి కంటి చూపును ప్రసాదిస్తున్న వరంగల్ రీజినల్​ కంటి ఆసుపత్రిపైనా దృష్టి పెట్టాలని రోగులు, ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.