మరాఠా రిజర్వేషన్లపై దిగొచ్చిన ప్రభుత్వం.. దీక్ష విరమించిన పాటిల్

మరాఠా రిజర్వేషన్లపై దిగొచ్చిన ప్రభుత్వం.. దీక్ష విరమించిన పాటిల్

కొంతకాలంగా మహారాష్ట్రలో కొనసాగుతోన్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమానికి ఎట్టకేలకు తెర పడింది. ఉద్యమ కారుడు మనోజ్ జరంగే పాటిల్ - ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే భేటీ అనంతరం.. వాషిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్‌లో జ్యూస్ అందించడంతో మనోజ్ జరంగే తన నిరాహార దీక్షను విరమించారు. వారి డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు.

సీఎం షిండేతో పాటు ఇతర మంత్రులు గిరీష్ మహాజన్, మంగళ్‌ప్రభాత్ లోధా, దీపక్ కేసర్కర్ జారంగే-పాటిల్‌ను కలిసి కుంబీ కమ్యూనిటీ కింద నమోదైన మరాఠా వర్గానికి చెందిన వారందరికీ ఓబీసీ సర్టిఫికెట్లు అందజేస్తామని జీఆర్‌ను అందజేశారు. అనంతరం సీఎం షిండే, మనోజ్ జరంగే-పాటిల్ కలిసి నవీ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేశారు.

తన నిరాహార దీక్షను ప్రారంభించిన మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్.. మహారాష్ట్ర ప్రభుత్వం తమ అభ్యర్థనను అంగీకరించిందని పేర్కొన్నారు. దీంతో తాము నిరసన విరమించినట్టు ప్రకటించారు. అంతకుముందు జనవరి 26న పాటిల్.. మరాఠా కోటాకు సంబంధించి ప్రభుత్వ తీర్మానాన్ని జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరసనకారులు శనివారం ఉదయం ముంబై వైపు కవాతు చేస్తారని అన్నారు. రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ల డిమాండ్‌పై పోలీసులు నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.