IBS క్యాంపస్‎లో గంజాయి కలకలం.. పోలీసులు అదుపులో 10 మంది విద్యార్థులు..!

IBS క్యాంపస్‎లో గంజాయి కలకలం.. పోలీసులు అదుపులో 10 మంది విద్యార్థులు..!

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ఐబీఎస్ క్యాంపస్‎లో గంజాయి కలకలం రేపింది. గంజాయి సేవిస్తోన్న 10 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఐబీఎస్ కాలేజీలో విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్లుగా సమాచారం అందడంతో మొకిలా పోలీస్ స్టేషన్ సిబ్బంది, రాజేంద్రనగర్ జోన్ ప్రత్యేక ఆపరేషన్స్ టీమ్ గురువారం (సెప్టెంబర్ 4) జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. 

తనిఖీల్లో భాగంగా ఐబీఎస్ కాలేజీలో లా చదువుతోన్న 8 మంది విద్యార్థులు, మహారాజుపేట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. ఓ నిందితుడి నుంచి 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కొంపల్లికి చెందిన వర్షిత్ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం నిందితులకు డ్రగ్స్ టెస్ట్ చేయగా.. పరీక్షల్లో అందరూ గంజాయి సేవించినట్లు తేలిందని చెప్పారు పోలీసులు. 

ప్రధాన నిందితుడు వర్షిత్ పరారీలో ఉన్నాడని తెలిపారు. మత్తు పదార్థాలు వినియోగం, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్‎ను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఇటీవలే మహేంద్ర యూనివర్శిటీలో కూడా గంజాయి కలకలం రేపిన విషయం తెలిసిందే. విద్యాలయాల్లో వరుసగా గంజాయి పట్టుబడుతుండటం చర్చనీయాంశంగా మారింది.