స్టాక్ మార్కెట్లను కాపాడిన ఐటీ, మెటల్ స్టాక్స్.. ఆర్‌బీఐ నిర్ణయం కోసం ఎదురుచూపు!

స్టాక్ మార్కెట్లను కాపాడిన ఐటీ, మెటల్ స్టాక్స్.. ఆర్‌బీఐ నిర్ణయం కోసం ఎదురుచూపు!

భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు ట్రేడింగ్‌లో భారీ ఒడిదుడుకుల మధ్య చివరకు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. మార్నింగ్ ట్రేడింగ్ సెషన్‌లో ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్ భయాలతో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 23,100 మార్కును దాటి ముగిసింది. ముఖ్యంగా ఐటీ, మెటల్, రియాల్టీ రంగాలు మార్కెట్లను లాభాల బాట పట్టించడంలో మధ్యాహ్నం నాటికి స్టాక్ మార్కెట్లు నష్టాల ఊబి నుంచి బయటపడ్డాయి. 

మార్కెట్ల రికవరీకి ప్రధాన కారణం ఐటీ షేర్లలో కనిపించిన భారీ కొనుగోళ్లే. ఎంఫాసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ వంటి సంస్థల షేర్లు 4 శాతం వరకు లాభపడ్డాయి. మార్చి త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉంటాయనే ఆశలు ఐటీ ఇండెక్స్‌కు బలాన్ని ఇచ్చాయి. ఐటీతో పాటు మెటల్ రంగం కూడా మెరిసింది. అల్యూమినియం ధరలు పెరుగుతాయన్న అంచనాలతో జేపీ మోర్గాన్ రేటింగ్‌ను పెంచడంతో హిందాల్కో, వేదాంత షేర్లు కూడా ఇవాళ ఇంట్రాడేలో 3 శాతం మేర లాభపడ్డాయి.

క్లోజింగ్ నాటికి అన్ని రంగాలు లాభపడలేదు. వడ్డీ రేట్లకు ప్రభావితమయ్యే ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు 0.7 శాతం నుంచి 1.5 శాతం మేర నష్టపోయాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో బుధవారం జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణ పరపతి సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతారనే అంచనాలు ఈ నష్టాలకు కారణమయ్యాయి. అలాగే క్వార్టర్లీ అప్‌డేట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేర్లు ఏకంగా 8 శాతం మేర పతనమయ్యాయి.

మొత్తానికి పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్నప్పటికీ.. భారత స్టాక్ మార్కెట్లు మాత్రం ఐటీ, మెటల్ రంగాల అండతో నిలబడగలిగాయి. గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ, దేశీయంగా ఐటీ కంపెనీల భవిష్యత్తుపై ఉన్న నమ్మకం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. రేపటి ఆర్‌బీఐ నిర్ణయం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తదుపరి ట్రేడింగ్ సెషన్లపై ప్రభావం చూపనున్నాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూనే క్వాలిటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్లకు మొగ్గు చూపుతున్నారు.